గుంటూరు జిల్లాలో దారుణం.. హ‌త్య‌కు గురైన యువ‌కుడు.!

N ANJANEYULU
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలోని వ‌ట్టిచెరుకూరు మండ‌లం ప‌ల్ల‌పాడు గ్రామానికి చెందిన బండాడు ఫ‌ణికృష్ణ అనే యువ‌కుడు(22) ప్రేమ వ్యవ‌హారంలో దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. వివ‌రాల‌ను చేబ్రోలు సీఐ మ‌ధుసూద‌న్‌రావు విలేక‌ర్ల స‌మావేశంలో వెల్ల‌డించారు. ప‌ల్ల‌పాడు గ్రామానికి చెందిన ఫ‌ణి కృష్ణ  అదే గ్రామంలో నివ‌సించే చావ‌లి ఎల్ల‌య్య కూతురును గ‌త కొంత కాలంగా ప్రేమిస్తున్నాడు. ఈ విష‌యంపై గ‌తంలో పోలీస్ స్టేష‌న్‌లో కేసు కూడా న‌మోదైంది. అనంత‌రం నిర్వ‌హించిన పంచాయితీలో ఆమెకు దూరంగా ఉంటాన‌ని ఫ‌ణికృష్ణ ఒప్పుకున్నాడు.
కొద్ది రోజుల త‌రువాత తిరిగి మ‌ర‌ల  ఆమెతో చ‌నువుగా ఉండ‌డం ప్రారంభించాడు.  దీంతో ఆగ్ర‌హానికి గురైన అమ్మాయి తండ్రి చావ‌లి ఎల్ల‌య్య ఫ‌ణికృష్ణ‌ను ఎలాగైన చంపాల‌ని ఓ ప‌థ‌కాన్ని ప‌న్నాడు. రాత్రి స‌మ‌యంలో త‌న స్నేహితులైన ప‌ల్ల‌పు సాంబ‌య్య‌, గంజి శ్రీ‌కాంత్‌, గుండాల న‌వీన్‌ల సాయంతో న‌మ్మకంతో వంగిపురం డొంక‌లో ఉన్న‌టువంటి తూము వ‌ద్ద‌కు ఫ‌ణికృష్ణను ర‌ప్పించాడు ఎల్ల‌య్య‌. అప్ప‌టికే ఆయుధాల‌తో ఎల్ల‌య్య‌తోపాటు లింగారావు, అప్పారావు, చావ‌లి గోపి, చావ‌లి రామ‌కృష్ణ‌లు కాపు కాసుకొని ఉన్నారు. ఫ‌ణికృష్ణ అక్క‌డి ఎప్పుడైతే వ‌చ్చాడో వెంట‌నే ఒకేసారి అంద‌రూ మూకుమ్మ‌డిగా బ‌రిసెలు, క‌ర్ర‌ల‌తో దాడి చేసి హ‌త్య చేశారు. మృతి చెందిన‌ట్టు నిర్థారించుకున్న త‌రువాత‌నే మృత‌దేహాన్ని దుప్ప‌ట్లో మూట‌గ‌ట్టి ద్విచ‌క్ర వాహ‌నంపై ముట్లూరు గ్రామం వైపు తీసుకెళ్లారు.  
అక్క‌డి నుంచి లేమ‌ల్లేపాడు రోడ్డులోని అప్పాపురం వాహినిలో ప‌డేశారు. ఫ‌ణికృష్ణ ఇంటికి రాక‌పోవ‌డంతో అత‌ని నాయ‌న‌మ్మ పోల‌మ్మ సోమ‌వారం పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుల‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. విచార‌ణ‌లో నిందితులు అస‌లు నిజాన్ని ఒప్ప‌కున్నారు. నిందితులు ఇచ్చిన స‌మాచారంతో ఫ‌ణికృష్ణ మృత‌దేహాన్ని వాహిని నుంచి వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకొని ద‌ర్య‌ప్తు చేస్తున్న‌ట్టు సీఐ వెల్ల‌డించారు. ఇన్ని రోజులు త‌మ కండ్ల ముంద‌ల తిరిగి ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా హ‌త్య‌కు గుర‌వ్వ‌డంతో ఫ‌ణికృష్ణ కుటుంబ స‌భ్యులు  రోద‌న‌లు మిన్నంటాయి. ప‌లువురు చావ‌లి ఎల్ల‌య్య కుటుంబ స‌భ్యుల‌పై దుమ్మెత్తి పోశారు. ప్రేమించినంత మాత్రాన యువ‌కుడిని పొట్ట‌న పెట్టుకుంటారా అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: