దిశాకేసు త‌న‌కు సంబంధం లేద‌ని.. స‌జ్జ‌నార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

N ANJANEYULU
దిశా హత్య‌కేసుకు సంబంధించిన  నిందితుల ఎన్‌కౌంట‌ర్‌పై విచార‌ణ క‌మిటీ ద‌ర్యాప్తు చేప‌డుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు కొంత‌మంది అధికారుల‌ను, ప్ర‌త్య‌క్ష సాక్షుల‌ను విచారించింది. తాజాగా ఆర్టీసీ ఎండీ, సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి వీసీ స‌జ్జ‌నార్‌ను విచార‌ణ చేప‌డుతోంది. ఆ ఎన్‌కౌంట‌ర్ నిర్వ‌హించిన‌ప్పుడు సైబ‌రాబాద్ క‌మిష‌న‌ర్‌గా స‌జ్జ‌నార్ విధులు నిర్వ‌హించారు. విచార‌ణ క‌మిటీకి స‌జ్జ‌నార్ కీల‌క విష‌యాలు వెల్ల‌డించాడు. దిశా కేసు ద‌ర్యాప్తుతో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని.. విచార‌ణ‌ను తాను ప‌ర్య‌వేక్షించ‌లేద‌ని ఆయ‌న క‌మిటీకి వాంగ్మూలం ఇచ్చారు.  సోమ‌వారం ఈ విచార‌ణ చేప‌ట్టారు.
దిశాకేసును తాను ప‌ర్య‌వేక్షించ‌లేద‌ని, త‌న‌కు ఎప్ప‌టిక‌ప్పుడు వివ‌రాలు చేప్పాల‌ని ప్ర‌త్యేక బృందాల‌కు ఆదేశాలు జారీ చేశాన‌ని అయిన త‌న‌కు స‌మాచారం అందించ‌లేద‌ని వెల్ల‌డించారు. ఈ కేసు విచార‌ణ‌ను పూర్తిగా శంషాబాద్ డీసీపీ ప‌ర్య‌వేక్ష‌ణ చేప‌ట్టారు. కేవ‌లం టెలికాన్ఫ‌రెన్స్‌లో మాత్ర‌మే నాకు చెప్పారని విచార‌ణ క‌మిటీ ముందు వాంగ్మూలం ఇచ్చారు. సైబ‌రాబాద్ క‌మిష‌న‌రేట్ చాలా పెద్ద‌ద‌ని, శాంతిభ‌ద్ర‌త‌ల ప‌ర్య‌వేక్ష‌ణ‌కు తాను ఇన్‌చార్జి అని.. అన్ని కేసుల‌కు నేను ఒక్క‌డినే ప‌ర్య‌వేక్షించ‌డం ఇబ్బంది అని ఆయ‌న తెలిపారు. సీనియ‌ర్ అధికారి ఈ విధంగా చెప్ప‌డం క‌రెక్టేనా అని స‌జ్జ‌నార్‌పై క‌మిష‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. దాదాపు 2 గంట‌ల పాటు 45 నిమిషాలు స‌జ్జ‌నార్ ను  ప్ర‌శ్నించింది. శంషాబాద్ డీసీపీ ఫోన్‌లో 2019 న‌వంబ‌ర్ 29న సాయంత్రం  చెప్పార‌ని వివ‌రించ‌గా దానిపై క‌మిష‌న్ ప‌లు ప్ర‌శ్న‌ల‌ను అడిగింది.
సాయంత్రం నిందితుల‌ను ప‌ట్టుకుంటే.. అదేరోజు రాత్రి 7 గంట‌ల‌కు డీసీపీ కార్యాల‌యంలో విలేక‌ర్ల స‌మావేశం ఎలా పెట్టారని.. కేవ‌లం గంట‌న్న‌ర స‌మ‌యంలోనే స‌మాచారం మొత్తం ఏవిధంగా తెలిసింది.. హ‌త్యాచార ఘ‌ట‌న‌ను అంతా గ్రాఫిక్స్‌లో వేసి మ‌రీ వివ‌రించారు క‌దా.. ఇదంతా ఎలా సాధ్య‌మైంద‌ని అడిగింది క‌మిష‌న్‌.  డీసీపీ స‌మాచారం ఇచ్చిన‌ప్పుడు తాను ఎయిర్‌ఫోర్ట్‌లోనే ఉన్నాను. వెంట‌నే అక్క‌డి నుంచి నేరుగా డీసీపీ సూచ‌న మేర‌కు ప్రెస్‌మీట్ నిర్వ‌హించాం అని స‌మాధానం చెప్పారు. డీసీపీ ఇచ్చిన స‌మాచారాన్నే ప్రెస్‌మీట్‌లో చెప్పారా..? అని ప్ర‌శ్నించ‌గా సీసీటీవీ పుటేజీని ప‌రిశీలించాన‌ని స‌జ్జ‌నార్ వెల్ల‌డించ‌డంతో విచార‌ణ క‌మిష‌న్ అస‌హ‌నం వ్య‌క్తం చేసింది.
నిందితులు స్కూటీ గాలి తీశారు. నోట్లో గుడ్డ కుక్కి హ‌త్యాచారం చేశారని.. ఇవ‌న్నీ సీసీటీవీ పుటేజీలో క‌నిపించాయా...? అని ప్ర‌శ్నించారు. ఘ‌ట‌న స్థ‌లంలో ల‌భించిన వ‌స్తువుల ఆధారంగానే చెప్పిన‌ట్టు వివ‌రించారు. కేసు విచార‌ణ చేప‌డుతున్న‌ప్పుడు ఆయుధాల‌ను పోలీసులు వెంట తీసుకెళ్లాల్సిన అవ‌స‌రం ఏమి వ‌చ్చింద‌ని ప్ర‌శ్నించారు. దీనిపై డీసీపీ సూచ‌న మేర‌కు తాను ఆయుదాల కేటాయింపు ప్ర‌క్రియ చేసిన‌ట్లు వెల్ల‌డించారు.  విచార‌ణ‌లో క‌మిష‌న్ వేసిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌జ్జ‌నార్ స‌మాధానం చెప్ప‌లేక దాట‌వేసిన‌ట్టు తెలుస్తోంది. ఈరోజు కూడా క‌మిష‌న్ ముందు హాజ‌రుకానున్నారు స‌జ్జ‌నార్‌.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: