బాబోయ్... గంటకు 3 రేప్‌లా...!

Podili Ravindranath
దేశంలో మహిళలపై నేరాలు ఆగడంలేదు. సగటున ప్రతీ గంటకు 3 రేప్‌లు, 3 హత్యలు నమోదవుతున్నట్లు జాతీయ నేర గణాంకాల బ్యూరో -ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడించింది. ఇలా ఏడాదిలో మొత్తం 28 వేల 46 ఘటనలు జరిగిన్నట్లు ప్రకటించింది ఎన్‌సీఆర్‌బీ. అయితే, మహిళలపై జరుగుతున్న నేరాలు 2019తో పోలిస్తే కాస్త తగ్గినట్లే అని కూడా ఎన్‌సీఆర్‌బీ వెల్లడించింది. 2020లో మొత్తం 3 లక్షల 71 వేల 503 కేసులు నమోదవ్వగా.. 2019లో ఈ సంఖ్య 4 లక్షలుగా ఉంది.
2020లో కొవిడ్‌ ఉద్ధృతి కారణంగా చాలావరకు లాక్‌డౌన్‌ ఆంక్షలు కొనసాగాయి. అయినప్పటికీ అత్యాచార కేసుల సంఖ్య మాత్రం భారీగా పెరిగింది. 2020లో మొత్తం 28 వేల 46 అత్యాచార ఘటనలు జరిగాయి. వీరిలో 25 వేల 498 మంది 18ఏళ్లకు పైబడిన వారే. మిగిలిన 2 వేల 655 మంది మైనర్లే. 2019లో 32 వేల 33 అత్యాచార కేసులు, 2018లో 33 వేల 356 కేసులు, 2017లో 35 వేల 559  అత్యాచార కేసులు నమోదయ్యాయి. ఇక 2016లో అత్యధికంగా దేశవ్యాప్తంగా 38 వేల 947 అత్యాచార కేసులు నమోదైనట్లు ఎన్‌సీఆర్‌బీ నివేదిక పేర్కొంది. అటు 2020లో నమోదైన మొత్తం అత్యాచార కేసుల్లో అత్యధికంగా రాజస్థాన్‌లోనే నమోదయ్యాయి. రాజస్థాన్‌లో 5 వేల 310 కేసులు రికార్డవ్వగా.. ఉత్తర్‌ప్రదేశ్‌లో 2 వేల 769 అత్యాచార కేసులు ఫైల్‌ అయ్యాయి.
దేశంలో మహిళలపై లైగింక దాడులు పెరుగుతున్నప్పటికీ వాటిని నిరోధించేందుకు కేంద్రం కఠిన చట్టాలను అమలు చేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చట్టంలోని లోసుగుల కారణంగా నిందితులు సులభంగా తప్పించుకుంటున్నారని... అందుకే నేరాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే మహిళా బిల్లు కోసం దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. దాదాపు 25 ఏళ్లుగా మహిళా బిల్లు ఆమోదం పొందకుండా పార్లమెంట్ లోనే ఉండిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: