ఆడ పిల్లలపై ఆగని అకృత్యాలు!

N.Hari
ఓ వైపు సైదాబాద్‌ చిన్నారి హత్యాచారం ఘటనపై తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తుతుండగా.. మరోవైపు రెండు రాష్ట్రాల్లో పలుచోట్ల చిన్నారులపై అకృత్యాలు, ఆడవాళ్ల పట్ల అమానుష ఘటనలు వెలుగుచూడటం కలకలం రేపుతోంది. చిత్తూరు జిల్లాలో ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడికి యత్నం ఘటన తీవ్ర కలకలం రేపింది. బి.కొత్తకోట ఇందిరమ్మ కాలనీలో ఈ ఘటన జరిగింది. చిన్నారులు కేకలు వేయడంతో స్థానికులు అప్రత్తమయ్యారు. నిందితులను చెట్టుకు కట్టేసి చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.
నెల్లూరు జిల్లా రామకోటినగర్‌లో యువతిపై దాడి ఘటన సోషల్‌ మీడియాలో, టీవీ న్యూస్‌ చానెళ్లలో ప్రసారం కావడం నగరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనపై ఆరా తీశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.. మూడు బృందాలు నిందితుల కోసం గాలించి పట్టుకున్నారు. ఘటనపై ఫిర్యాదు అందకపోయినా.. 363, 341, 354ఏ, 67ఏ సెక్షన్ల కింద సుమోటోగా కేసు నమోదు చేశారు. వెంకటేశ్వర్లు యువతిని విచక్షణారహితంగా కర్రతో కొడుతుంటే... శివ కుమార్ అనే వ్యక్తి వీడియో తీసినట్టు విచారణలో తేలింది. ఎంతో మంది పేద మహిళలు, యువతులను నిందితుడు వెంకటేశ్వర్లు వ్యభిచార వృత్తిలోకి దింపినట్టు తెలుస్తోంది. నిందితులపై రౌడీ షీట్‌ ఓపెన్‌ చేసినట్లు ఎస్పీ విజయరావు తెలిపారు.
ప్రకాశం జిల్లాలోని ఒంగోలు బస్టాండు వద్ద ఏడేళ్ల చిన్నారిపై అదే ప్రాంతానికి చెందిన యువకుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐదు రోజుల క్రితం ఆడుకుంటున్న బాలికను యువకుడు ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను ఆసుపత్రికి తరిలించి చికిత్స అందించారు. అధికార పార్టీ నాయకుల జోక్యంతో ఇంకా కేసు నమోదు కానట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బయటకు రానివ్వకుండా నిందితుడి బంధువులు రాజీ ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది. అయితే రోజులు గడుస్తుండడంతో ఆనోటా...ఈనోటా బయటకు పొక్కి పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఐదుగురు కాటికాపరులు చిన్నారుల కిడ్నాప్‌కు ప్రయత్నించారు. దీంతో గ్రామస్థులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. స్కూల్‌కు వెళ్తున్న విద్యార్థులను కిడ్నాప్‌ చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. కిడ్నాప్‌ కలకలంతో ఉదయగిరి ప్రజలు ఉలిక్కిపడ్డారు. చిన్నారులకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేస్తూ...పోలీస్‌ స్టేషన్‌ ముందు ఆందోళన చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: