హైటెక్‌ వ్యభిచారం గుట్టు రట్టు

N.Hari
హైదరాబాద్‌ పోలీసులు హైటెక్‌ వ్యభిచారం గుట్టును రట్టు చేశారు. విదేశాల నుంచి యువతులను రప్పించి, ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ కేంద్రంగా ప్రముఖులను ఆకర్షిస్తూ, సైలెంట్‌గా సాగుతున్న హైటెక్‌ వ్యభిచారాన్ని బట్టబయలు చేశారు. గచ్చిబౌలిలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో ఇటీవల పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ముగ్గురు విదేశీ యువతులను అదుపులోకి తీసుకున్నారు. ఒడిశాకు చెందిన మణికేష్ యాదవ్‌ను కూడా పోలీసులు పట్టుకున్నారు. అయితే పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. కజకిస్థాన్‌, థాయ్‌లాండ్‌, ఉజ్బెకిస్థాన్‌ నుంచి యువతులను భారత్‌కు రప్పిస్తున్నట్టు తేలింది. అయితే విదేశీ యువతులను విజిట్ వీసాపై భారత్‌కు తీసుకొస్తున్నారు. వీసా గడువు ఉన్నంత వరకు వివిధ నగరాల్లో తిప్పుతున్నారు. సెక్స్‌రాకెట్‌ను నడుపుతున్నారు.
విదేశీ యువతుల కోసం  కర్ణాటకలోని హుబ్లీ కేంద్రంగా.. ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్ తయారు చేయిస్తున్నారు. దీంతో వీసా గడువు ముగిసినా విదేశీ యువతులు ఇక్కడే ఉండిపోతున్నారు. పోలీసుల అదుపులో ఉన్న మణికేష్ యాదవ్ సెల్‌ఫోన్‌లో.. వ్యభిచారానికి సంబంధించిన కీలక  విషయాలను పోలీసులు గుర్తించారు. విదేశాల నుంచి వచ్చిన యువతలను గ్రేడింగ్‌ల వారీగా విభజించి మరీ చీకటి వ్యాపారం సాగిస్తున్నట్లు తేలింది. యువతలను యాపిల్‌, చెర్రీ, మ్యాంగో వంటి పేర్లు కలిగిన గ్రేడింగులు విభజించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. లావాదేవీలు కూడా బయటపడ్డాయి. మరోవైపు విదేశీ యువతులు ఒక్కో సిటీలోని ఖరీదైన హోటళ్లలో ఒకటి రెండు రోజులు మాత్రమే ఉంటారని తెలుస్తోంది. అయితే ఆ యువతులను ఎప్పుడు హైదరాబాద్‌కు తీసుకువచ్చే విషయం ప్రధాన నిర్వాహకుడికి మాత్రమే తెలుస్తుందట.
ఇక పట్టుబడిన విటుల్లో ప్రముఖులు, ధనవంతులు, సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు..కంపెనీల్లో కీలక హోదాల్లో ఉన్నవాళ్లు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది..! హైదరాబాద్‌కు చెందిన కొందరు ప్రముఖుల ఫోన్ నంబర్లు.. వాట్సాప్ చాటింగ్‌లను చూసి పోలీసులే షాకయ్యారు. హైటెక్ వ్యభిచారం వెనకాల పెద్ద వ్యవస్థే ఉందని అనుమానిస్తున్నారు. నిందితుడిని కస్టడీలోకి తీసుకుని అన్ని కోణాల్లో వివరాలు రాబట్టాలని పోలీసులు యత్నిస్తున్నారు..!  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: