లవర్ కోసం ఏటీఎంకి కన్నమేశారు.. చివరికి

Deekshitha Reddy
లవర్ కోసం ఒకడు, తన స్నేహితుడు లవర్ తో సంతోషంగా ఉండాలని ఇంకొకడు.. ఇలా ఇద్దరూ ఏటీఎంని దోచే ప్రయత్నం చేశారు. ప్రేమ మత్తులో నిండామునిగిన ఆ యువకుడు దొంగతనం చేసి తన జీవితాన్ని సంతోషంగా గడపాలని అనుకున్నాడు. ప్రేయసిని ఆకట్టుకునేందుకు, ఆమెకు ఖరీదైన బహుమతులు కొనేందుకు తన వద్ద డబ్బులు లేకపోవడంతో ఈజీ మనీకోసం వెంపర్లాడాడు. చివరకు తన స్నేహితుడిని కూడా ఆ దొంగతనంలో భాగస్తుడిని చేశాడు. ఈ పాచికలేవీ పారకపోవడంతో ఇద్దరూ ఇప్పుడు కటకటాలు లెక్కపెడుతున్నారు. లవ్ కోసం, లవర్ కోసం.. ఫ్రెండ్ కోసం, ఫ్రెండ్షిప్ కోసం ఈ దొంగతనం జరగడం విశేషం.
ప్రియురాలిని ఆకట్టుకోడానికి, డబ్బులు సులభంగా దొరకాలని ఆ కుర్రాడుదొంగగా మారాడు. పశ్చిమ ఢిల్లీలోని రన్‌ హోలా ప్రాంతంలోని ఏటీఎంలో దొంగతనం చేయడానికి ప్రయత్నించి దొరికిపోయాడు. అయితే ఇక్కడ అతని స్నేహితుడు కూడా బుక్కయ్యాడు. ఏటీఎంలో చోరీకి ప్రయత్నించిన వ్యక్తి, అతనికి సహాయం చేసిన స్నేహితుడు.. ఇద్దర్నీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏటీఎం దొంగలిద్దరూ రాజస్థాన్‌ లోని దౌసా జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. కమల్, పర్వీన్ అనే ఇద్దరు స్నేహితులు ఏటీఎంలో దొంగతనం చేయాలనుకున్నారు. గ్యాస్ కట్టర్ తో మనీ బాక్స్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించారు. శనివారం తెల్లవారు ఝామున 2 గంటల 15 నిముషాల ప్రాంతంలో ఇద్దరూ రన్ హోలా ప్రాంతంలోని ఓ ఏటీఎంలో దూరారు. గ్యాస్ కట్టర్ తో ఏపీఎం ని తెరిచే ప్రయత్నం చేశారు. అయితే ఇద్దరూ కొత్త దొంగలు కావడంతో ఎంత సేపటికి అది తెరచుకోలేదు. ఈలోగా వారి విశ్వ ప్రయత్నాన్ని చూసిన కొందరు పోలీసులకుసమాచారమిచ్చారు. పోలీసులు వచ్చేలోగా వారు గ్యాస్ కట్టర్ అక్కడే వదిలేసి పారిపోయారు.
రన్ హోలా ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు విశ్లేషించారు. బప్రోలాలోని హర్‌ ఫూల్ విహార్‌ లో వారిద్దరూ ఉన్నట్టు గుర్తించారు. వెంటనే వారిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వారిద్దరూ చెప్పిన సమాధానం విని పోలీసులు షాకయ్యారు. తాము స్వతహాగా దొంగలం కాదని చెప్పారు వారిద్దరూ. వీరిద్దరిలో పర్వీన్ అనే కుర్రాడికి ఓ గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆమెను ఇంప్రెస్ చేయడానికి, ఆమెకు ఖరీదైన గిఫ్ట్ లు ఇవ్వడానికి దొంగతనం చేయాలనుకున్నాడు. అతడికి కమల్ సహాయం చేశారు. గ్యాస్‌ కట్టర్‌, ఎల్‌ పీజీ సిలిండర్‌, ఇతర పరికరాలు తీసుకుని ఇద్దరూ దొంగతనానికి వెళ్లారు. చివరకు పోలీసులకు చిక్కారు. లవర్ కోసం ఒకరు, స్నేహితుడి కళ్లలో ఆనందం కోసం ఇంకొకరు.. ఇలా ఇద్దరూ ఇప్పుడు జైలుపాలయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: