అత్యాచార ఘటనలు ఆగేదెన్నడు.. సింగరేణి చిన్నారికి న్యాయం జరిగిందా..?

MOHAN BABU
హైదరాబాద్ నగరంలో ఆరేళ్ల చిన్నారిని లైంగిక దాడి, చేసిన నిందితుడు ఆత్మహత్య చేసుకోగానే చిన్నారికి న్యాయం జరిగినట్టేనా..? అత్యాచారం జరిగినప్పుడు ప్రజలలో ఆవేశం ఉప్పొంగడం సహజం. ఈ ఘాతుకానికి పాల్పడిన వాళ్లను విచారణకు ముందే కాల్చి చంపాలని డిమాండ్ రావడం సర్వసాధారణం. అయితే కఠినమైన, భయంకరమైన శిక్షల ద్వారా అత్యాచారాలను అదుపు  చేయగలమనే అపోహలో సమాజం ఉన్నంతకాలం అమాయకులు బలి అవుతూనే ఉంటారు. కానీ దీనికి అంతిమ ముగింపు ఏమిటనేది ఎవరూ ఆలోచించడం లేదు. వీటికి మూలాలు వెతికే పరిష్కారం మార్గం లభించనంత కాలం మనుగడ కష్టసాధ్యమనే విషయం ప్రతి ఒక్కరు గమనించాలి.

 కఠినమైన శిక్ష లతో పాటు మానవ విలువలు వ్యవస్థీకృతం కావాలి. రాజ్యం లేదా అధికారంలో ఉన్న వారి ప్రధాన కర్తవ్యం మానవీయమైన, బాధ్యతాయుతమైన, స్వేచ్ఛాయుత  సమాజ నిర్మాణానికి దోహదపడాలి. అందుకు అవసరమైన సామాజిక, నైతిక విలువలను సంఘంలో వ్యవస్థీకృతం చేయాలి. ఆడపిల్లల మీద ఇప్పటి వరకు జరిగిన ఏ ఒక్క హత్యాచారం లోనూ రాష్ట్ర సీఎం కేసీఆర్ స్పందించలేదు.  ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఏ ఘటనలో కూడా  బాధితుల తరఫున మాట్లాడలేదు. ఆరేళ్ళ చిన్నారి ఘటన తో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకోవడం తో వారం తర్వాత మంత్రులు స్పందించారు. బాధిత కుటుంబానికి 20 లక్షల చెక్కును ఇచ్చి ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇలాంటి పాలనలో చిన్నపిల్లలకు, మహిళలకు రక్షణ ఊహించలేం అని ప్రజాతంత్ర వాదులు, మేధావులు అభిప్రాయపడు తున్నారు.

ఏదైనా ఘటన జరిగినప్పుడే పార్టీలు, ప్రజాసంఘాలు గగ్గోలు పెడుతున్నాయని, అందుకు కారణమైన మూలాలను వెతకడంలో పూర్తిగా విఫలమవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఒత్తిడి తేవడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం,ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు సమిష్టిగా మానవ విలువలను కాపాడాల్సిన బాధ్యత ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వీరిపై కఠిన చట్టాలను తీసుకురావాల ని ప్రజలు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: