వడ్డీ రేట్లు యథాతథం... మార్చేది లేదన్న ఆర్బీఐ గవర్నర్....!

Podili Ravindranath
ఏడాదిన్నర తర్వాత కూడా వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచేసింది రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా. ద్వైపాక్షిక సమావేశ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ రోజు వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో రెపో రేటు 4 శాతం దగ్గరే స్థిరంగా కొనసాగిస్తున్నట్లు కూడా శక్తికాంత దాస్ ప్రకటించారు. కరోనా కారణంగా ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థకు అవసరం ఉన్నత కాలం... వడ్డీ రేటు అనుకూలంగానే కొనసాగుతుందన్నారు దాస్. రివర్స్ రెపో రేటును కూడా స్థిరంగా 3.35 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు కూడా ఆర్బీఐ గవర్నర్ ప్రకటించారు. రియల్ జీడీపీ వృద్ధి రేటును యథాతథంగా 9.5 శాతం వద్దే కొనసాగిస్తున్నామని దాస్ తెలిపారు. వడ్డీ రేట్లు స్థిరంగా కొనసాగించేందుకు ఎంపీసీ 5:1తో చర్చించి నిర్ణయించినట్లు వెల్లడించారు దాస్. కేంద్రం తాజాగా పెట్రోల్, డీజీల్ ఉత్పత్తులపై పన్ను తగ్గించడంపై కూడా దాస్ ప్రస్తావించారు. డీజీల్, పెట్రోల్ ధరలు తగ్గడం వల్ల ప్రజల్లో కొనుగోలు శక్తి కూడా గణనీయంగా పెరుగుతుందని దాస్ ఆశాభావం వ్యక్తం చేశారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా... గతేడాది మార్చి నెలలో కేంద్రం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది. దాదాపు రెండు నెలల పాటు లాక్ డౌన్ కారణంగా దేశ ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నం అయ్యింది. దేశంలో ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగు పడేందుకు కేంద్రం కూడా ఆత్మ నిర్భర్ భారత్ పేరుతో ఏకంగా 20 లక్షల కోట్ల రూపాయలతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. అలాగే పేదల కోసం ఇప్పటికీ పౌర సరఫరా శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికి బియ్యం ఉచితంగా అందిస్తోంది కేంద్రం. దీంతో గతేడాది మార్చి నెల నుంచి కూడా వడ్డీ రేట్లను ఏ మాత్రం మార్పు చేయలేదు ఆర్బీఐ. ఇప్పుడు తాజాగా ఓమిక్రాన్ వేరియంట్ వేరస్ కేసులు కూడా ప్రస్తుతం విస్తరిస్తున్న నేపథ్యంలో... మరి కొంత కాలం పాటు వడ్డీ రేట్లను ఆర్బీఐ మార్పు చేసే పరిస్థితి లేదని కూడా ఇప్పటికే ఆర్థిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవల నిర్వహించిన పలు సర్వేల్లో కూడా వడ్డీ రేట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేటస్ కోతో వెళ్తున్నట్లు ఆర్థిక వేత్తలు వెల్లడించారు. రెపో రేటు స్థిరంగా ఉంటుందని... అదే సమయంలో రివర్స్ రెపో రేటు మాత్రం 15 నుంచి 20 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశం ఉందని కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ ఆర్బీఐ మాత్రం ఎలాంటి మార్పులు చేయకుండా స్థిరంగా కొనసాగించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: