ఎయిర్ ఇండియాలో ఏం జరుగుతోంది....!

Podili Ravindranath
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ ఇండియా విమానయాన సంస్థలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఎయిర్ ఇండియా సంస్థను టాటా సన్స్ సంస్థ సొంతం చేసుకుంది. ఒప్పందంలో భాగంగా వచ్చే ఏడాది జనవరి నెలలో టాటా సన్స్ సంస్థ ఎయిర్ ఇండియా సంస్థను టేక్ ఓవర్ చయనుంది. అయితే ఈ ప్రక్రియకు రెండు నెలలు గడువుండగానే... కీలక పరిణామం చోటు చేసుకుంది. సంస్థ చేతులు మారుతున్న సమయం దగ్గర పడుతున్నందున కేంద్రం నుంచి లోపాయకారి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఎయిర్ ఇండియా బోర్డు సభ్యులు తమ పదవులకు రాజీనామా చేయాలనే ఆదేశాలు అందినట్లుగా సమాచారం. వచ్చే నెలలో జరగనున్న ఎయిర్ ఇండియా సర్వ సభ్య సమావేశంలో బోర్డులోని ఏడుగురు సభ్యులు తమ పదవులకు రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బోర్డులో ఉన్న ఏడుగురు సభ్యులు కూడా రాజీనామా చేసేందుకు రెడీ అయినట్లు ఇప్పటికే విశ్వసనీయ సమాచారం.
ప్రస్తుతం బోర్డులో ఉన్న నలుగురు ఫంక్షనల్ డైరెక్టర్లు, ఇద్దరు ప్రభుత్వ నామినీ డైరెక్టర్లు, ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవుల్లో ఉన్నారు. వీరంతా ప్రస్తుతం ప్రభుత్వం తరఫున ఎయిర్ ఇండియా బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతంల ఉన్న నియమాల ప్రకారం ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసిన టాటా సన్స్ సంస్థకు అప్పగించే ముందే బోర్డు ఆఫ్ డైరెక్టర్లు తమ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. దీంతో వచ్చే నెలలో ఎయిర్ ఇండియా సంస్థ చివరి బోర్డు సమావేశంలో ఏడుగురు బోర్డు సభ్యులు తమ రాజీనామాలు సమర్పించాల్సి ఉంది. ఇదే విషయాన్ని ఎయిర్ లైన్స్ అధికారులు వెల్లడిస్తున్నారు. రాజీనామా విషయంపై బోర్డు సభ్యులకు ఈ నెల 15వ తేదీనే ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. డిసెంబర్ రెండో వారంలో బోర్డు సమావేశం కానుంది. ఇదే ఈ బోర్డుకు చివరి సమావేశం కానుంది. ప్రస్తుత ఎయిర్ ఇండియా బోర్డులో నాన్ అఫీషియల్ డైరెక్టర్‌గా బీజేపీ సీనియర్ నేత సయ్యద్ జాఫర్ ఉన్నారు. ఆయన కూడా తన పదవికి రాజీనామా చేయాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: