ప్రభుత్వ ఆస్తులు లీజుతోనే అభివృద్ధా !

Chandrasekhar Reddy
కరోనా సంక్షోభం వలన ఎప్పుడూ చూడని నష్టాలను దేశం చూడాల్సి వచ్చింది. ఇంతకంటే నష్టాలను చూడాల్సిన సందర్భాలు ఇక రాకపోవచ్చని ఆర్థిక వేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఇక ఆర్థిక రంగం పుంజుకోవడం తప్ప మరో అవకాశం లేదని, అయితే ఆయా రంగాల కృషిని బట్టి ఫలితాలు రానున్నాయని వారు అంచనా వేస్తున్నారు. సంక్షోభం నుండి బయట పడటానికి అందరు కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉందని, అప్పుడే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని వారు అబిప్రాయపడుతున్నారు. కేవలం ఒక రంగంపైన లేదా ఒక వర్గం కోసం ఈ కృషి ఉండరాదని, అప్పుడే ఫలితాలు అందరికి అందించవచ్చని వారు అంటున్నారు. ఒక్కసారి ఆర్థిక పురోభివృద్ధి ప్రారంభం అయితే అది పెరుగుతూ పోవాల్సిందే తప్ప నేల చూపులు చూడాల్సిన పరిస్థితి ఇక రాబోదని వారు అంచనా వేస్తున్నారు.
ఇక ప్రభుత్వాలు  కూడా ఆర్థికాభివుద్దిని పరుగులు పెట్టించాలని కృషి చేస్తూనే ఉన్నాయి. అయితే అందుకు ఆయా రంగాలకు ప్రోత్సహకాలు ఇవ్వడం మాని, ప్రభుత్వ రంగ ఆస్తులను తనఖా పెట్టి వచ్చిన దానిని పెట్టుబడులుగా మార్చడానికి చూస్తున్నాయి. కేవలం ప్రైవేట్ రంగం పై ఆధారపడితే తాజాగా అమెరికాలో ఏర్పడిన పరిస్థితులు భవిష్యత్తులో భారత్ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవన్నీ పట్టించుకోని ప్రభుత్వాలు మాత్రం వారికి తోచిందే చేసుకుంటూ పోతున్నాయి. ఎప్పుడు తాత్కాలిక పరిష్కారాలతో పబ్బం గడిపేసుకుంటున్న రాజకీయనేతలు ఈ సంక్షోభంలో కూడా అదే తరహాలో వ్యవహరించడం శోచనీయం.
తాజాగా కాంగ్రెస్ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషించిన అహ్లువాలియా ఒక విర్చువల్ సమావేశంలో ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించవచ్చని సూచించారు. దీని ద్వారా విద్యుత్, రోడ్లు, రైల్వే రంగాలలో మౌలిక వసతుల ఆస్తుల విలువ భారీగా పెరిగే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. ఆయా రంగాలలో నిరుపయోగంగా ఉన్న ఆస్తుల తనఖా వలన  బహుళ ప్రయోజనాలు చేకూరనున్నాయని ఆయన అన్నారు. ఇలాంటివి ఇప్పటికే జరుగుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో అమలు అయితేనే ఫలితాలు అనుకూలంగా ఉంటాయని ఆయన అన్నారు. ఈ లీజు పద్దతిలో యాజమాన్య హక్కులు లేదా స్థల బదలాయింపులు ఉండబోవని ఆయన తెలిపారు. తద్వారా ఆస్తులు ప్రభుత్వం చేతిలోనే ఉంటాయని, కేవలం నిర్వహణ బాధ్యతలు మాత్రం ప్రైవేట్ వారు చేస్తుంటారని వివరించారు అహ్లువాలియా. దీనిని రాహుల్ గాంధీ గతంలో వ్యతిరేకించిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: