హైదరాబాద్ మెట్రో ఫర్ సేల్...?

Podili Ravindranath
హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు.. ప్రారంభ సమయంలో ఎల్‌ అండ్‌ టీ సంస్థకు అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని.. ప్రాజెక్ట్‌ను చేపట్టింది. తొలి రైలు పట్టాలెక్కి ఐదేళ్లు పూర్తవుతున్న తరుణంలో.. ఇప్పుడీ ప్రాజెక్టు ఎల్‌ అండ్‌ టీకి తెల్ల ఏనుగులా మారింది. ఆ సంస్థకున్న ప్రాజెక్టుల్లో అప్రాధాన్య, కీలకేతర ప్రాజెక్టుగా పరిగణించే పరిస్థితి వచ్చింది. తన సర్వశక్తినీ ధారబోసి మెట్రోను పూర్తి చేసిన ఎల్‌ అండ్‌ టీ..  ఇప్పుడు ఈ ప్రాజెక్టులోని తన వాటాలను విక్రయించాలని చూస్తోంది.
నిర్మాణ దశలోని బాలారిష్టాలను అధిగమిస్తూ.. అన్ని రూట్లూ పూర్తి చేసి.. పట్టాలపై రైళ్లు పరుగులు తీస్తున్న తరుణంలో మెట్రోకు అసలైన ఇబ్బందులు మొదలయ్యాయి. నష్టాలు వెంటాడాయి. సాఫీగా సాగుతున్న ప్రయాణాన్ని కరోనా ఒక్కసారిగా కుదిపేసింది. రైళ్ల పరుగులు ఆగిపోయాయి. నిర్వహణ నష్టాలు పెరిగాయి. తిరిగి సర్వీసులు ప్రారంభమైనా.. ప్రయాణించేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపించడం లేదు. దీంతో చాలా సార్లు అత్యంత తక్కువ మంది ప్రయాణికులతోనే సర్వీసులు నిర్వహించాల్సి వస్తోంది. దీంతో హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టులో తన వాటాను విక్రయించేందుకు లార్సన్‌ అండ్‌ టూబ్రో నిర్ణయించుకుంది.
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఏర్పాటు చేసిన హైదరాబాద్‌ మెట్రోలో ఎల్‌అండ్‌టీకి 90 శాతం వాటా ఉండగా, 10 శాతం వాటా తెలంగాణ ప్రభుత్వం చేతిలో ఉంది. కాకపోతే మెట్రోలో ఉన్న మొత్తం వాటాను అమ్ముతారా..? కొంత మొత్తాన్ని మాత్రం విక్రయిస్తారా అన్నది స్పష్టం చేయలేదు. హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు విషయానికొస్తే.. ఎల్‌ అండ్‌ టీకి మొదటి నుంచి నష్టాలే వస్తున్నాయని అంటున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.16,571 కోట్లు కాగా.. వివిధ కారణాలతో ఇది రూ.18,971 కోట్లకు చేరింది. ఇందులో రూ.13,500 కోట్లు అప్పుల ద్వారా సేకరించింది ఎల్‌ అండ్‌ టీ. దీనికి తోడు 2019 - 20లో రూ.383 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. 2020-21లో ఈ నష్టాలు ఏకంగా రూ.1,766 కోట్లకు చేరాయి. కొవిడ్‌ కారణంగా 2020 మార్చి 23 నుంచి సెప్టెంబరు 8 వరకు దాదాపు ఆరు నెలలపాటు మెట్రో రైల్‌ సేవలు పూర్తిగా నిలిచిపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఇప్పుడు సర్వీసులు నడుస్తున్నా కొవిడ్‌కు ముందు ఉన్నంత రద్దీ లేదు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం కూడా నష్టాలు తప్పకపోవచ్చని భావిస్తున్నారు.
ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవడం, ప్రాజెక్టు వ్యయం పెరిగిపోవడంతో కంపెనీకి అసలు, వడ్డీ చెల్లింపులు భారంగా మారాయి. ఉద్యోగుల వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కారణంగా ఇప్పుడప్పుడే ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం కనిపించడం లేదు. మరోపక్క, రూ.4 వేల కోట్ల పెట్టుబడుల కోసం నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌తో జరుపుతున్న చర్చలు కూడా ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టులో తన వాటాను అమ్ముకోవడమే మేలనే నిర్ణయానికి ఎల్‌ అండ్‌ టీ వచ్చిందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: