టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి..!

N ANJANEYULU
టాలీవుడ్‌లో మరొక విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్ర‌ముఖ సినీ ద‌ర్శ‌కుడు పి.చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి (86) ఇవాళ ఉద‌యం 8.30 గంట‌ల‌కు చెన్నైలో తుదిశ్వాస విడిచారు. చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి త‌న సినీ కెరీర్‌లో దాదాపు 80 చిత్రాల‌కు పైగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ‌, శోభ‌న్‌బాబు లాంటి టాలీవుడ్ లెజెండ‌రీ న‌టుల‌తో ఆయ‌న ప‌ని చేసారు. నాటీ ప్ర‌ముఖ హీరోలంద‌రి చిత్రాల‌కు ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం విశేషం. ముఖ్యంగా సూప‌ర్ స్టార్ కృష్ణ చిత్రాల‌కు ఎక్కువ‌గా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆయ‌న మృతి చెందార‌నే వార్త తెలియ‌గానే ప‌లువురు సినీ ప్ర‌ముఖులు పీ.సీ.రెడ్డికి సంతాపం తెలిపారు.
పీసీరెడ్డిగా సినీ ప‌రిశ్ర‌మ‌లో పేరు పొందిన ఆయ‌న పూర్తి పేరు పందిళ్ల‌ప‌ల్లి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి. నెల్లూరు జిల్లాలోని అనుమ‌స‌ముద్రం పేట‌లో 1933లో అక్టోబ‌ర్ 14న జ‌న్మించారు. 1971లో కృష్ణ‌, విజ‌య‌నిర్మ‌ల జంట‌గా న‌టించిన అనురాధ చిత్రంతో ఆయ‌న ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌యమ‌య్యారు. అత్త‌లు-కోడ‌ళ్లు, విచిత్ర దాంప‌త్యం, ఇల్లు ఇల్లాలు, బ‌డిపంతులు, తాండ‌వ కృష్ణుడు, మానవుడు-దాన‌వుడు, నాయుడు బావ‌, మాన‌వుడు-మ‌హ‌నీయుడు, పుట్టింటి గౌర‌వం, ఒకే ర‌క్తం, రాముడు-రంగ‌డు, ఇలా ప‌లు సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అయితే కృష్ణ హీరోగా మొత్తం 20 చిత్రాలు తెర‌కెక్కించారు పీ.సీ.రెడ్డి. ఆయ‌న వ‌ద్ద  ద‌ర్శ‌క‌త్వ  విభాగంలో ప‌ని చేసిన  బి.గోపాల్, ముత్యాల సుబ్బ‌య్య‌, పీ.ఎన్‌.రామ‌చంద్ర‌రావు వంటి వారు ద‌ర్శ‌కులుగా రాణించారు. ఎన్టీఆర్‌తో కూడా బ‌డిపంతులు సినిమాను చేసారు చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: