ధరణిలో భూమి ఒకరిది.. పాస్‌ బుక్‌ మరొకరికి..! రైతు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

N ANJANEYULU
త‌మ పేరున ఉన్న భూమికి మ‌రొక‌రి పేరు మీద పాస్ పుస్త‌కం జారీ చేయ‌డంతో ఓ రైతు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసాడు. దీనిని స‌రిచేయాల‌ని అధికారుల చుట్టూ నెల‌ల త‌ర‌బ‌డి తిరిగినా ఎలాంటి ఫ‌లితం లేక‌పోవ‌డంతో రైతు చేసేది ఏమి లేక పురుగుల మందు తాగాడు. వివరాల్లోకి వెళ్లితే.. మ‌హ‌బూబాబాద్ జిల్లా కేస‌ముద్రం మండ‌లం ఇనుగుర్తికి చెందిన వెంక‌న్న త‌న తండ్రి అంత‌య్య పేరు మీద ఉన్న ఇనుగుర్తిలో 3.39 ఎక‌రాల భూమికి ప‌ట్టాదార్ పాస్ పుస్త‌కం ఉన్న‌ది.
2017లో జారీ చేసిన ప‌ట్టా పాస్ పుస్త‌కంలో కేవ‌లం 2.17 ఎక‌రాలు న‌మోదు అయి ఉంది. మిగిలిన 1.22 ఎక‌రాల భూమి మరొక‌రి పేరు మీద పాస్ పుస్త‌కం జారీ చేసారు అధికారులు. త‌న తండ్రి పేరిట ఉన్న 3.39 ఎక‌రాల భూమిని త‌న పేరుమీద ప‌ట్టా పాస్ పుస్త‌కాన్ని జారీ చేయాల‌ని ప‌లుమార్లు వెంక‌న్న త‌హ‌సీల్దార్ కార్యాల‌యం చుట్టూ తిరిగాడు.  ఎన్నిసార్లు అధికారుల‌కు విన్న‌వించినా.. కార్యాల‌యం చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా అధికారులు మాత్రం ప‌ట్టించుకోలేద‌ని మ‌న‌స్థాపానికి గురైన వెంక‌న్న పురుగుల మందు తాగాడు. ఇదే స‌మ‌స్య‌తో గ‌తంలో వెంక‌న్న త‌ల్లి ప్ర‌మీల కూడ 4 నెల‌ల కింద‌ట పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య చేసుకుందని బాధిత కుటుంబ స‌భ్యులు వాపోయారు. ఇప్ప‌టికైనా పూర్తి విస్తీర్ణం క‌లిగిన త‌మ భూమికి పాస్ పుస్త‌కం జారీ చేయాల‌ని బాధిత కుటుంబ స‌భ్యులు కోరుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: