శ్రీకాకుళంలో ఉద్రిక్తత.. టీడీపీ నాయకుడు కూన రవికుమార్​ అరెస్ట్​

N ANJANEYULU
ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు, ఆయ‌న స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రిపై వైఎస్సార్‌సీపీ నేత‌లు చేసిన వ్యాఖ్య‌ల త‌రుణంలో ఏపీ ప్ర‌భుత్వ మాజీ విప్‌, టీడీపీ నాయ‌కుడు కూన ర‌వికుమార్ నిర‌స‌న చేసేందుకు బ‌య‌లుదేరారు. ఈ విష‌యం తెలుసుకున్న పోలీసులు అత‌ని ఇంటి వ‌ద్ద‌కు చేరుకొని గృహ‌నిర్భందం చేసారు. గృహ‌నిర్బంధం చేసిన పోలీసుల‌పై కూన ర‌వికుమార్ అనుచిత వ్యాఖ్య‌లు చేసారంటూ శ‌నివారం అర్థ‌రాత్రి స‌మ‌యంలో హైడ్రామా మ‌ధ్య అత‌న్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
శ్రీ‌కాకుళం జిల్లా ఎచ్చెర్ల పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొన్న‌ది.  కూన ర‌వికుమార్‌ను విడుద‌ల చేయాల‌ని నిర‌స‌న చేప‌ట్టారు టీడీపీ శ్రేణులు.  అయితే టూ టౌన్ సీఐ ప్ర‌సాద‌రావుపై ర‌వికుమార్ దుర్బాష‌లాడాలంటూ కేసు న‌మోదు చేసారు. ఒక వైపు రాష్ట్రం మొత్తం వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో అత‌లాకుత‌లం అవుతుంటే ప్ర‌భుత్వం ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌డం దుర్మార్గ‌మ‌ని టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. కూన ర‌వికుమార్‌ను త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేస్తున్న కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా టీడీపీ జాతీయ కార్య‌ద‌ర్శి నారా లోకేష్ కూడా కూన అరెస్ట్ ను ఖండించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: