పాత‌బ‌స్తీలో పేలుడు.. ఇద్దరు మృతి..!

N ANJANEYULU
హైదరాబాద్ మ‌హానగరంలోని పాతబస్తీలో గురువారం రాత్రి స‌మ‌యంలో పేలుడు చోటుచేసుకుంది. ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో  ఈ ఘటన జ‌ర‌గ‌గా.. ఇందులో ఇద్దరు దుర్మరణం చెందారు. అదేవిధంగా మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. ఛత్రినాక కందికల్‌ గేట్‌ వద్ద ఈ సంఘటన జ‌రిగిన‌ది.  సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌న‌ స్థలానికి చేరుకుని గాయాలైన వ్యక్తిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఆస్ప‌త్రిలో చికిత్సను అందిస్తున్నారు.  పోలీసులు క్లూస్‌ టీం బృందానికి  సమాచారం ఇవ్వడంతో.. అక్కడికి చేరుకున్న బృందం ఘటన స్థలాన్ని పరిశీలించారు.

మృతులలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన విష్ణు (25), జగన్నాధ్ (30) ల‌ను గుర్తించారు.  మృతిచెందిన వారు పీవోపీ విగ్రహ తయారీ కార్మికులుగా  ప‌ని చేస్తున్న‌ట్టు పోలీసులు పేర్కొన్నారు. విగ్రహల‌ తయారీ పరిశ్రమలో బాణసంచా తయారీ కారణంగానే ఈ పేలుడు సంభవించిన‌దని.. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించార‌ని పోలీసులు వెల్ల‌డించారు.  రసాయనాలు కలవడంతో పేలుడు తీవ్రత ఎక్కువ‌గా అయింద‌ని,  పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించినట్టు చెప్పారు. గాయపడిన వ్యక్తి వీరేంద్ర కుమార్‌కు మెరుగైన చికిత్స అందుతుందని పోలీసులు వివ‌రించారు.  ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తును చేప‌డుతున్నాం అని పోలీసులు వెల్ల‌డించారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: