కేంద్రం మరో కీలక నిర్ణయం... చెక్ బౌన్స్ ఇక నేరం కాదు....?
కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సంక్షోభంతో తల్లడిల్లుతున్న వ్యాపార వర్గాలకు కాస్త ఊరటనిచ్చే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. చిన్న చిన్న ఉల్లంఘనలను క్రిమినల్ చర్యల పరిధి నుంచి తప్పించడంపై కేంద్రం ప్రధానంగా దృష్టి పెట్టింది. ఖాతాల్లో బ్యాలెన్స్ లేక చెక్ బౌన్స్ కావడం, రుణాల చెల్లింపు నిబంధనల ఉల్లంఘన లాంటి ఇతర చిన్న నేరాలను డీక్రిమినలైజ్ చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదనలు రూపొందించింది.
ఇందుకోసం 19 చట్టాలలో సవరణలు చేయనుంది. జూన్ 23లోగా తమ అభిప్రాయాలను సంబంధిత వర్గాలు తెలపాలని కేంద్రం ఆదేశించింది. ఆ అభిప్రాయాల ఆధారంగా నిర్దిష్ట సెక్షన్ పరిధిలో ఏ నేరాలను క్రిమినల్ నేరాల కింద కొనసాగించాలి, వేటిని డీక్రిమినలైజ్ చేయవచ్చు అనే అంశంపై ఆర్థిక సర్వీసుల విభాగం నిర్ణయం తీసుకుంటుంది. ఆర్థిక శాఖ తాజాగా చేసిన ప్రకటనలో చిన్న నేరాలను డీక్రిమినలైజ్ చేయడం వ్యాపారాలకు సులభతరమైన పరిస్థితులు కల్పించే దిశగా ఎంతగానో తోడ్పడుతుందని... న్యాయవ్యవస్థలు, జైళ్లపై ఒత్తిడి తగ్గగలదని ఒక ప్రకటనలో పేర్కొంది.