ఏపీలో అభివృద్ధి నిల్ - అవినీతి ఫుల్.... జగన్ సర్కార్ పై యనమల తీవ్ర విమర్శలు...?
టీడీపీ నేత యనమల రామకృష్ణుడు మరోమారు జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది ప్రజాస్వామ్యం కాదని... దొంగల పాలన అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జగన్ ఏడాది పాలనపై వైసీపీ ఎమ్మెల్యేలే తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో జగన్ ఏడాది పాలనపై వ్యతిరేకత రావడమే ఇందుకు కారణమని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని భావించడం లేదని చెప్పారు.
ప్రభుత్వ వైఫల్యాలపై జనం ప్రశ్నిస్తారని భావించి జగన్ తప్పించుకు తిరుగుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతూ ఉండటం వల్లే వైసీపీ నేతలు కూడా జగన్ సర్కార్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఏపీలో అభివృద్ధి నిల్ అవినీతి ఫుల్ అని టీడీపీ ఎప్పటినుంచో చెబుతోందని... ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అదే చెబుతున్నారని అన్నారు.