గోదారోళ్లా మజాకా... మామూలుగా ఉండదు...

Podili Ravindranath
గోదారోళ్లంటేనే ఓ ప్రత్యేకం. వెటకారమైనా... మమకారమైనా... అభిమానమైనా.. ఆప్యాయతైనా... మర్యాదలైనా... ఒక్కమాటలో చెప్పాలంటే.. మా గోదారోళ్ల గురించి చెప్పాలంటే... అబ్బో.. అంటూ మొదలుపెడతారు. ఇక చీర, సారె విషయంలో అయితే... వాళ్ల తర్వాతే. అల్లుళ్లకు, అత్తమామలకు, వియ్యంకులకు, బంధువులకు మర్యాదలు చేయాలంటే వారి తర్వాతే. పెళ్లి భోజనం దగ్గర నుంచి.... అల్లుడికి ఆషాదం సారె పంపే వరకు కూడా ఓ ప్రత్యేకత చాటుతారు. ఇటీవల ఓ పెద్దాయన అల్లుడి ఆషాడం కానుక... మామూలుగా లేదు. ఇక అత్తగారి 60వ పుట్టిన రోజు సందర్భంగా ఓ కోడలు 60 రకాల వంటల చేసి అందరితో శభాష్ అనిపించుకుంది. అయితే తాజాగా ఓ మామగారు తన కోడలి పుట్టిన రోజుకు ఓ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అంటేనే మర్యాదలకు పెట్టింది పేరు. పసందైన విందులకు మారు పేరు. కోడలి కోసం ఏకంగా 150 రకాల ఐటమ్స్ తో స్పెషల్ డిన్నర్ ఏర్పాటు చేసి... అవాక్కయ్యేలా చేశారు ఆ మామగారు. భీమవరం పట్టణానికి చెందిన తుంపూడి వెంకటకృష్ణ గుప్తా... తన కోడలు తేజస్విని పుట్టినరోజుకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. అదిరిపోయే వంటకాలతో సూపర్ డిన్నర్ ఇచ్చారు. ఏకంగా 14 రకాల రైస్ ఐటమ్స్, 35 రకాల స్వీట్స్, 35 రకాల హాట్స్, 20 రకాల చాక్లెట్లు, 20 రకాల కేకులు, 11 రకాల బజ్జీలు, 15 రకాల పండ్లు... అబ్బో... ఇలా ఎన్నో ప్రత్యేకాలతో.. మొత్తం 150 రకాల ఐటమ్స్ తో కోడలిని ఆశ్చర్యపరిచారు. అసలు ఇన్ని రకాల ఐటమ్స్ కూడా ఉంటాయా అని కూడా తేజస్విని ఆశ్చర్యపోయింది. పుట్టిన రోజు ఇంత గ్రాండ్ గా ఉంటుందని తాను ఏ రోజు ఊహించలేదని తేజస్విని సంతోషం వ్యక్తం చేస్తోంది. తాను అత్తగారింట్లో ఉన్నట్లుగా లేదని... తనపై మామగారు చూపిన అభిమానానికి మాటలు రావడం లేదంటోది తేజస్విని. ఏది ఏమైనా... గోదారోళ్ల ప్రత్యేకతే వేరు కదా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: