పవన్ కళ్యాణ్..... నిజంగానే వ్యసనం...!

SS Marvels
పవన్ కళ్యాణ్...ఈ పేరు వినగానే రెండు తెలుగు రాష్ట్రాల్లోని యువత ఉరకలెత్తే ఉత్సాహంతో ఊగిపోతుంటారు. పవర్ స్టార్ అనే బిరుదు అతనికి మొదట ఎవరు ప్రతిపాదించారో తెలియదు గాని నిజంగానే తెలుగు రాష్ట్రాల్లో అతను 'పవర్' లా మారిపోయాడు. ఇంట్లో పవర్ లేకపోతే ఎలాంటి పరిస్థితి ఉంటుందో అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో గానీ, రాష్ట్ర రాజకీయాల్లో గానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోయినా కూడా అదే పరిస్థితి. అంతలా తన ప్రత్యేకతను సృష్టించుకున్నాడు.

కొన్ని విషయాలను విశదీకరించి, లోతైన విశ్లేషణ చేసినవారికి మాత్రమే అతనిలోని ప్రత్యేక లక్షణాలు తెలుస్తాయి. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుకుంటే... సాధారణంగా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అంత అందగాడు కాదు, ప్రభాస్ అంత ఆజానుబాహుడు కాదు, అల్లు అర్జున్, రామ్ చరణ్ లలాగా డ్యాన్సులు చేయలేడు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటనా వైవిధ్యాన్ని ప్రదర్శించలేడు. అయినా కూడా వాళ్లెవ్వరికీ లేనంత క్రేజ్, చరిష్మా పవన్ కళ్యాణ్ కి మాత్రం ఎలా వచ్చిందనేది ఇండస్ట్రీలోనే కాకుండా బయటి వారికి కూడా సందేహం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని లోతుగా విశ్లేషించుకుంటే అప్పుడు ఆ క్రేజ్, చరిష్మాలు పవన్ కి ఎందుకు, ఎలా వచ్చిందనేది తెలుస్తుంది.

వివరాల్లోకి వెళితే 1996లో కళ్యాణ్ తన సినీ కెరీర్ ప్రారంభించే టప్పుడు కేవలం చిరంజీవి తమ్ముడిగా మాత్రమే తెలుసు కానీ రెండవ సినిమా గోకులంలో సీత రిలీజ్ అయ్యే సమయానికి మార్షల్ ఆర్ట్స్, రిస్కీ ఫైట్లు అంటూ సాహసాలు చేసే హీరోగా గుర్తింపు పొందాడు.ఇక మూడవ సినిమా సుస్వాగతం
రిలీజ్ అయ్యే సమయానికి పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ ఏంటంటే కాలేజ్ స్టూడెంట్ లా అల్లరి చిల్లరిగా తిరగడం అలాగే కొంచెం నెగెటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్లు చేసిన ఇమేజ్ మాత్రమే సంపాదించాడు. ఇక సుస్వాగతం రిలీజ్ తర్వాత ఒక క్రొత్త పవన్ కళ్యాణ్ ని ఆవిష్కరించాడు. ఆ మూవీతో సిన్సియర్ లవర్ కమ్ సెన్సిబుల్ కొడుకు క్యారెక్టర్లో జీవించాడు. ఇక తరువాత వచ్చిన తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషీ సినిమాల్లోని పవన్ చేసిన క్యారెక్టర్లలో యువత తమను తాము పోల్చుకోవడంతో పవన్ కళ్యాణ్ యువత హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు.

ఇదే కాక పవన్ కళ్యాణ్ లో మరింత మందిని ఆకర్షించే అంశాలు... సామాజిక స్పృహ, సహాయ గుణం, మాట తప్పని నైజం, దేశభక్తి భావాలు...తను నటించే సినిమాలలో సందర్భాన్ని సృష్టించి మరీ పాటల రూపంలోనో, సన్నివేశాల రూపంలోనో ఆఖరికి డైలాగుల రూపంలోనో దేశభక్తిని ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేయడం, క్రొత్త వారికి అవకాశాలు ఇవ్వడం, ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తన దృష్టికి వేస్తే వెంటనే తగిన విధంగా స్పందించటం, వ్యవసాయ పనులు చేయడం, అన్నింటినీ మించి సాధారణ జీవితం గడపటం లాంటివి పవన్ కళ్యాణ్ ను యువత 'నావాడు, మనోడు' అనుకునేంత దగ్గర చేసింది.
'తీన్ మార్' ఆడియో రిలీజ్ వేడుకలో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చెప్పినట్లుగా పవన్ కళ్యాణ్ నిజంగానే ఒక వ్యసనం... ఎందుకంటే అతన్ని ఒక్కసారి ఇష్టపడితే మళ్లీ చచ్చేవరకూ వదిలిపెట్టలేం అని రెండు తెలుగు రాష్ట్రాల్లోని అతని అభిమానులు చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: