ఎయిరిండియా ఫర్ సేల్..!

Podili Ravindranath
ఎయిరిండియా విమానయాన సంస్థను కొనేందుకు రెండు  బడా సంస్థలు పోటీ పడుతున్నాయి. ఎయిరిండియా కోసం రేసులో టాటా గ్రూప్‌, స్పైస్‌జెట్ సంస్థలు నిలిచాయి. నష్టాల ఊబిలోఉన్న ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ఎయిరిండియా విమానయాన సంస్థను అమ్మేందుకు మోదీ సర్కార్ సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన బిడ్డింగ్ ప్రక్రియ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎయిరిండియా విక్రయానికి సంబంధించిన బిడ్ల దాఖలు గడువు ముగిసింది. గడువులోపు రిజర్వ్‌ ధర కంటే ఎవరైతే ఎక్కువ బిడ్‌ దాఖలు చేస్తారో వారి బిడ్లను మాత్రమే ఆమోదిస్తారు. ఈ లావాదేవీలను చూసే సలహాదారు బిడ్లను పరిశీలించిన తర్వాత కేబినెట్‌ ఆమోదం కోసం సిఫార్సు చేస్తారు.
బిడ్లు దాఖలు చేసిన సంస్థల్లో టాటా సంస్థతో స్పైస్ జెట్ పోటీ పడుతోంది. అయితే ఈ పోటీలో ముందువరుసలో టాటా సంస్థ నిలిస్తే 67 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఎయిరిండియా టాటాల వశం అవుతుంది. 1932లో టాటా గ్రూప్‌ టాటా ఎయిర్‌లైన్స్‌ను నెలకొల్పింది. ప్రస్తుతం టాటాలు సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌తో కలిసి విస్తారా ఎయిర్‌లైన్స్‌ను నడుపుతున్నారు. మరోవైపు ఎయిర్‌ ఇండియాకు మొత్తం 43 వేల కోట్ల రూపాయల మేర రుణాలు ఉన్నాయి. వీటిల్లో 22 వేల కోట్ల రూపాయల రుణాలను ఎయిర్‌ ఇండియా అసెట్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌కు బదిలీ చేయనున్నారు.
ఢిల్లీ కన్నాట్ ప్లేస్‌లోని నాలుగు ఎకరాల భూమి, ఢిల్లీ, ముంబైతో పాటు ఇతర నగరాల్లోని హౌసింగ్ సొసైటీలను ప్రయివేట్ సంస్థలకు అప్పగిస్తారు. ఎయిర్‌ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్, ఎయిర్ ఇండియా ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ లాంటివి కూడా ఒప్పందంలో భాగంగా ఉంటాయి. ఇప్పటికే ఈ సంస్థ కోసం విదేశీ కంపెనీలు పోటీ పడినప్పటికీ... ఆ తర్వాత అప్పుల కారణఁగా కాస్త వెనక్కి తగ్గాయి. ఇప్పుడు టాటా సంస్థ రేసులో నిలవడంతో సంస్థ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: