కస్టమర్లకు షాక్ ఇవ్వబోతున్న వొడాఫోన్ ఐడియా... మూసివేత దిశగా కంపెనీ..!

Reddy P Rajasekhar

దేశంలోని వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు అతి త్వరలో వొడాఫోన్ ఐడియా కంపెనీ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఏజీఆర్ ప్రభావంతో వొడాఫోన్ ఐడియా కంపెనీకి ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో 50,921 కోట్ల రూపాయల నికర నష్టాలు వచ్చాయి. గతంలో భారత్ లో ఏ కంపెనీ ప్రకటించని స్థాయిలో వొడాఫోన్ ఐడియా నికర నష్టాలను ప్రకటించింది. నష్టాల్లో ఉన్న వొడాఫోన్ ఐడియా ఛైర్మన్ మంగళం బిర్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
కంపెనీకి కేంద్ర ప్రభుత్వం నుండి సహాయం కావాలని సహాయం అందని పక్షంలో కంపెనీని మూసివేయక తప్పదని చెప్పారు. హెచ్‌టీ లీడర్ షిప్ సమ్మిట్ లో కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం, సహకారం అందించాలని లేకపోతే కంపెనీని మూసివేయాల్సి వస్తుందని అన్నారు. వొడాఫోన్ ఐడియా కంపెనీలో పెట్టుబడుల కొనసాగింపు ఉండదని దెబ్బ తిన్న తరువాత మరలా డబ్బులు పెట్టడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. 
 
టెల్కోలను కేంద్రం ఆదుకోవాలని భావిస్తే మాత్రం అందుకు తగిన మార్గాలు ఉన్నాయని చెప్పారు. బిర్లా కామెంట్లతో వొడాఫోన్ ఐడియా షేరు ధర పతనమైంది. సుప్రీం కోర్టు టెలికాం కంపెనీలు కేంద్రానికి 92,000 కోట్ల రూపాయలు మూడు నెలలలోగా కట్టేయాలని టెల్కోలకు ఆదేశాలు జారీ చేసింది. మూడు రోజుల క్రితం వొడాఫోన్ ఐడియా ప్లాన్ల ధరలను కూడా పెంచింది. జియో రాకతో ఐడియా, వొడాఫోన్ కంపెనీలు నష్టాల బాట పట్టాయి. 2017 సంవత్సరం లో వొడాఫోన్, ఐడియా కంపెనీలు విలీనమయ్యాయి. విలీనానికి ముందు రెండు, మూడు స్థానాల్లో ఉన్న వొడాఫోన్, ఐడియా కంపెనీలు విలీనమైనప్పటికీ నష్టాలు మాత్రం తప్పటం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: