జీహెచ్ఎంసీ కార్యాల‌యం వ‌ద్ద బీజేపీ కార్పొరేట‌ర్ల నిర‌స‌న

N ANJANEYULU
హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో ఉన్న‌టువంటి జీహెచ్ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యం ముట్ట‌డికి ఇవాళ బీజేపీ కార్పొరేట‌ర్లు య‌త్నించారు. మేయ‌ర్ ఛాంబ‌ర్ లోకి వెళ్లేందుకు య‌త్నించ‌డంతో ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ది. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించ‌డంతో తోపులాట చోటు చేసుకుంది. జ‌న‌ర‌ల్ బాడీ స‌మావేశం ఏర్పాటు చేయాలని, ప్ర‌జా స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించాల‌ని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్పొరేట‌ర్లు, కార్య‌క‌ర్త‌లు నిర‌స‌న వ్య‌క్తం చేసారు.

గ‌త ఐదు నెల‌ల కింద‌ట వ‌ర్చువ‌ల్ స‌మావేశం పెట్టినా ప‌నులు జ‌ర‌గ‌లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు బీజేపీ నేత‌లు. ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల మ‌ధ్య బీజేపీ శ్రేణుల‌ను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. గ్రేట‌ర్ జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేస్తే మేయ‌ర్‌, టీఆర్ఎస్ కార్పొరేట్ల అవ‌క‌త‌వ‌క‌లు బ‌య‌ట‌ప‌డుతాయ‌నే నిర్వ‌హించ‌డం లేద‌ని బీజేపీ కార్పొరేట‌ర్లు ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. నిధుల‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేసారు. అభివృద్ధి ప‌నుల‌కు సంబంధించిన బిల్లుల‌ను మంజూరు చేసి కాంట్రాక్ట‌ర్ల‌కు డ‌బ్బులు ఇవ్వ‌డం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మేయ‌ర్, క‌మిష‌న‌ర్ ఛాంబ‌ర్ వ‌ద్ద ధ‌ర్నాలు చేసి.. నిధులు వెంట‌నే విడుద‌ల చేయాల‌ని పోస్ట‌ర్లు అతికించారు. పూల‌కుండీలను ప‌గుల‌గొట్టారు కార్య‌క‌ర్త‌లు. ఇప్ప‌టికైనా మేయ‌ర్ ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌ట్టించుకొని చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, లేని ప‌క్షంలో ఆందోళ‌న‌లు ఉధృతం చేస్తామ‌ని బీజేపీ శ్రేణులు హెచ్చ‌రించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: