రైతుల ఆత్మహత్యలలో తెలంగాణ నాలుగో స్థానం : బండి సంజ‌య్

N ANJANEYULU
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు, క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండిసంజ‌య్ మ‌రొకసారి విమ‌ర్శ‌లు చేసారు. కేసీఆర్ తెలంగాణ‌లో దీక్ష చేస్తే ఢిల్లీలో ఉన్న కేంద్ర‌ప్ర‌భుత్వం దిగి వ‌చ్చింద‌ని టీఆర్ఎస్ నేత‌లు ప్ర‌చారం చేసుకుంటున్నార‌ని ఎద్దేవా చేశారు బండి సంజ‌య్‌. కేసీఆర్ దీక్ష చేసింది తెలంగాణ రైతుల కోస‌మా..?  లేక పంజాబ్ రైతుల కోస‌మా..?  అని బండి ప్ర‌శ్నించారు. రైతు మిల్ల‌ర్ల కోసం సీఎం ఆలోచిస్తున్నార‌ని.. తాము రైతుల కోసం ఆలోచిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు బండి సంజ‌య్‌.
ఢిల్లీలో చ‌నిపోయిన రైతుల‌కు కేంద్ర‌ప్ర‌భుత్వం రూ.25ల‌క్ష‌లు ఇవ్వాల‌ని కేసీఆర్ పేర్కొంటున్నాడ‌ని.. క‌న్న‌త‌ల్లికి కోక కొన‌ని వాడు.. పిన‌త‌ల్లికి బంగారు గాజులు పెట్టిన‌ట్టు ఉంది కేసీఆర్ తీరు అని మండిప‌డ్డారు బండి సంజ‌య్‌. దేశంలో రైతుల ఆత్మ‌హ‌త్య‌ల విష‌యంలో తెలంగాణ రాష్ట్రం నాలుగ‌వ స్థానంలో ఉంద‌ని.. 2019లో 419 రైతులు, 2020లో 471 రైతులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని వెల్ల‌డించారు. రైతులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నవారంద‌రికీ కేసీఆర్ రూ.20లక్ష‌లు ఇస్తాడా అని బండి ప్ర‌శ్నించారు. ప్ర‌తి విష‌యానికి తెలంగాణ సెంటిమెంట్ జోడిస్తాడ‌ని ఆరోపించారు. తెలంగాణ‌లో రైతుల ఆత్మ‌హ‌త్య‌లు వాస్త‌వం కాదా..?  రైతుల ఇబ్బందులు వాస్త‌వం కాదా అని నిల‌దీసారు. ధాన్యం త‌డిసినా.. మొల‌క‌లు వ‌చ్చినా వెంట‌నే కొనాల‌ని, బోన‌స్ రూ.500 ఇవ్వాల‌ని తాను డిమాండ్ చేస్తున్నట్టు వ్యాఖ్యానించారు బండి సంజ‌య్‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: