ఈసారి తిరుప‌తి విమానాశ్ర‌యం వంతు?

Garikapati Rajesh

తిరుప‌తి విమానాశ్ర‌యాన్ని ప్ర‌యివేటుప‌రం చేసే ప్రతిపాదనలను ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా కేంద్రానికి పంపించింది.  ఏడు చిన్న, ఆరు పెద్ద విమానాశ్రయాలను కలిపి ఉమ్మడిగా బిడ్డింగ్‌ నిర్వహించాలని ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రతిపాదించింది. ఇందులో భాగంగా వారణాశి-ఖుషీనగర్‌, గయ, అమృత్‌సర్‌-కాంగ్రా, భువనేశ్వర్‌-తిరుపతి, రాయ్‌పుర్‌-ఔరంగాబాద్‌, ఇండోర్‌-జబల్‌పుర్‌, తిరుచ్చి-హుబ్లి విమానాశ్రయాలను ఒక్కో ప్రాజెక్టులా ప్రైవేటుకు అప్పగించనున్నారు. లాభాలు పెద్దగా లేని విమానాశ్రయాలను మంచి లాభాలున్న వాటితో కలిపి బిడ్డింగ్‌కు పెట్టడం వల్ల ప్రైవేటు సంస్థలు స్పందిస్తాయని కేంద్రం భావిస్తోంది.  2022-25 మధ్య దేశంలోని 25 విమానాశ్రయాలను ప్రైవేటీకరించి, రూ.20,782 కోట్లు రాబట్టుకోవాలని నిర్ణయించినట్లు నేషనల్‌ మానిటైజేషన్‌ పాలసీలో కేంద్రం ప్రకటించింది. ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా చేతిలో 137 విమానాశ్రయాలు ఉన్నాయి. అందులో 24 అంతర్జాతీయ, 10 కస్టమ్స్‌, 103 దేశీయ విమానాశ్రయాలు. 2020-21లో అహ్మదాబాద్‌, లఖ్‌నవూ, మంగళూరు, గువాహటి, జైపుర్‌, తిరువనంతపురం విమానాశ్రయాలను ప్రైవేటుకు అప్పగించేసింది. 2024లో ఏపీలోని విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను ప్రైవేటీకరించి రూ.860 కోట్లు రాబట్టుకోవాలని కేంద్రం నిర్ణయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: