బోన‌స్ గా 78 రోజుల వేత‌నం

Garikapati Rajesh

రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం దీపావళి బంప‌ర్ ఆఫ‌ర్‌ ప్రకటించింది. మొత్తం 78 రోజుల పని దినాలకు స‌రిప‌డా వేత‌నాన్ని  ఈ యేడాది దీపావళికి బోనస్‌గా వేయనున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం ప్రకటించారు. అయితే ఇది రైల్వేలో పని చేస్తున్న నాన్-గెజిటెడ్ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందన్నారు. అంతేకాకుండా నాన్-గెజిటెడ్ కేటగిరీలోనే ఉన్న ఆర్‌పీఎఫ్/ఆర్‌పీఎస్ఎఫ్ ఉద్యోగులకు ఇది వర్తించదని స్ప‌ష్టం చేశారు. రైల్వేలో ప్రస్తుతం 11.52 లక్షల మంది నాన్‌-గెజిటెడ్ ఉద్యోగులు ఉండ‌గా ఇందులో ఆర్‌పీఎఫ్/ఆర్‌పీఎస్ఎఫ్ ఉద్యోగులను మినహాయించి బోనస్ అందుతుందని మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ప్రోడక్టివిటీ లింక్‌డ్ బోనస్ పేరిట 1979-80లో ప్రారంభమైన ఈ సంప్రదాయం.. రైల్వేలో నేటికీ కొనసాగుతోంది. అయితే ఇది గతంలో 72 రోజుల పనిదినాల‌ వేతనానికి సరిపడా ఉండేది. మోదీ ప్రభుత్వం దీన్ని తాజాగా 78 రోజులకు పెంచింది. ఈ బోన‌స్‌పై రైల్వే ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేత‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. అలాగే రైల్వేల ప్ర‌యివేటీక‌ర‌ణ విష‌యం కూడా వెన‌క్కి తీసుకోవాల‌ని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: